తెలంగాణ

గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ..

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చీకటి కోణాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి యువతులను డబ్బు ఆశ చూపించి వారి నుంచి రహస్యంగా అండాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని సంతాన సాఫల్య కేంద్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు బేగంపేట పరిధిలోని ప్రకాశ్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నగరంలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ఏడాది నుంచి హాస్టల్‌ ముసుగులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.కొందరు నిర్వాహకులు ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి నుంచి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయినట్టు తెలిసింది.