తెలంగాణ

పనిచేసే వారికే పట్టం.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీలు?

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పరిపాలనా విభాగంలో భారీ మార్పులు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. మరోసారి కీలక అధికారులకు స్థానచలనం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రుల మాటను కూడా లెక్కచేయడం లేదని తెలుస్తోంది. కీలక శాఖలకు చెందిన ఫైల్స్‌ను పెండింగులో పెట్టడం, మంత్రుల సిఫారసు ఉన్నా వాటి మీద కొర్రీలు పెట్టి తిప్పిపంపడం, లేదా అప్రూవల్ ఇవ్వడంలో జాప్యం చేయడం చేస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వరుసగా మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది.