Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!
Pranay Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత - ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడిగా (A4) జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మరణించారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.చర్లపల్లి జైల్లో ఉన్న అబ్దుల్ బారీకి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వార్డులో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి అతడు మరణించినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం బారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
