Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ముసుగులో సాగించిన భూదందాపై శాసనసభ వేదికగా పెను దుమారం రేగింది. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపడుతోందని చెబుతూనే, గత బీఆర్ఎస్ పాలనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, వారి బంధుగణం మాత్రమే విపరీతంగా బాగుపడ్డారని పొంగులేటి విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో కేసీఆర్ రెవెన్యూ శాఖను తనవద్దే అట్టిపెట్టుకోవడం వెనుక ఉన్న అసలు మతలబు భూముల అక్రమాలకు పాల్పడటమేనని ఆయన స్పష్టం చేశారు. ధరణిని అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాలను దర్జాగా దోచుకున్నారని విమర్శించారు.
