ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం : హరీశ్ రావు
రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు. ‘మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు. నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం.సీఎం రేవంత్ రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం.. ప్రజలపై పోలీసులతో జులుం.. ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులు.. హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?’ అంటూ ప్రశ్నించారు.
