National

గర్భా వేడుకల్లో బాలికతో అసభ్యప్రవర్తన..బీజేపీ నేతపై పోక్సో కేసు

ఇండోర్‌ - హీరానగర్ ప్రాంతంలో ఉన్న కంకేశ్వరి గర్బా ఉత్సవ్‌ వద్ద 15 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్ బయటకు నెట్టివేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి అతన్ను అడ్డుకునేందుకు యత్నించగా బూతులు తిడుతూ దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గర్భా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలిక ప్రవేశం విషయంలో వివాదం తలెత్తడంతో కమల్ చౌహాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించి, బయటకు నెట్టివేశాడని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.దీంతో సదరు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 74 కింద కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అక్కడే ఉన్న పలువురిని భయభ్రాంతులకు గురిచేసినట్టు కూడా తెలుస్తోంది.