తెలంగాణ

పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేయాలి : హరీశ్ రావు

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుని, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ (DPC) ద్వారా స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని కోరారు. పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న వేలమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తును కాపాడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇస్తూ జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 66 కోట్ల గుడ్‌విల్, బిల్లుల్లో ప్రతినెలా 20 శాతం కమీషన్లు నొక్కేస్తూ పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఫైర్ అయ్యారు.