National

PM Modi: దేశాన్ని ముక్కలు చేసే వాళ్లంతా ఒక్కటయ్యారు.. ప్రధాని మోడీ ఆరోపణలు!

PM Modi: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలనే దురుద్దేశంతో భారత వ్యతిరేక శక్తులు ఏకమై కుట్రలు పన్నుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన 'రాష్ట్రీయ ఏకతా దివస్' వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, విపక్షాలు, విభజన శక్తులపై నిప్పులు చెరిగారు.దేశాన్ని అంతర్గతంగా బలహీనపరిచేందుకు 'దిమాగీ నక్సల్స్' (మేధో నక్సలైట్లు) సిద్ధమయ్యారని, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. "భారత వ్యతిరేక శక్తులన్నీ ఏకమై దేశంలో చీలికలు తేవాలని చూస్తున్నాయి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు, విషపూరిత వదంతులు వ్యాప్తి చేస్తూ దేశంలో అశాంతిని, అస్థిరతను సృష్టించే కుట్రలో మునిగిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం మాతృభూమి బిడ్డల మధ్య గొడవలు పెడుతున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.