Plastic Plates Risks: ప్లాస్టిక్ ప్లేట్లో తిండి.. విషాన్ని ఆహ్వానిస్తున్నట్లేనా?
Plastic Plates Risks: శుభకార్యాలు, దావత్‌లు, హోటళ్లు, చివరకు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల దాకా ఎక్కడ చూసినా విస్తరాకుల స్థానాన్ని రంగురంగుల ప్లాస్టిక్ ప్లేట్లు ఆక్రమించేశాయి. వాడటం సులువు, కడిగే పనిలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ప్లాస్టిక్ ప్లేట్లను విచ్చలవిడిగా వాడేస్తున్నాం. కానీ వేడి వేడి అన్నం, మసాలాలు నిండిన కూరలు, వేడి సాంబార్‌ను ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో వేసుకుని తింటుంటే.. తెలియకుండానే శరీరంలోకి తీవ్రమైన విషాన్ని పంపుతున్నామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలావరకు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఏమాత్రం ‘ఫుడ్ గ్రేడ్’ ప్రమాణాలతో తయారైనవి కావు. వాటిలో ప్లాస్టిక్ మెత్తగా, అనువుగా ఉండటానికి థాలైట్స్, బిస్ఫినాల్-ఎ (BPA) వంటి ప్రమాదకర కెమికల్స్ కలుపుతారు. వేడి వేడి ఆహార పదార్థాలు ఆ ప్లేట్లలో పడగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని విషపూరిత రసాయనాలు కరిగి ఆహారంలో కలిసిపోతాయి (కెమికల్ మైగ్రేషన్). ఈ రసాయనాలు నేరుగా కడుపులోకి చేరి రక్తంలో కలిసిపోవడం వల్ల శరీరంలోని కీలక వ్యవస్థలు క్రమంగా కుప్పకూలిపోతాయి.
