పెన్షన్ బ్రేక్.. దివ్యాంగుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం : కవిత
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులు, దివ్యాంగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇంతవరకూ అమలు చేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత దివ్యాంగుల పక్షాన గళం వినిపించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస మానవత్వం లేదు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారిని చీకటిలోకి నెట్టేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వైకల్యం ఉండి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలికి 3 నెలలుగా పెన్షన్ నిలిపివేయడం అన్యాయం.మరోవైపు జగిత్యాల జిల్లాలో ఒక దివ్యాంగ మహిళ డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తక్షణమే దీనస్థితిలో ఉన్న దివ్యాంగులకు పింఛన్ కొనసాగించడంతో పాటు డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’ అని రాసుకొచ్చారు.
