తెలంగాణ

బీసీ సీఎంపై మాట మార్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక్కసారిగా మాట మార్చారు. ఇప్పుడు బీసీ లీడర్ ముఖ్యమంత్రి కావడానికి తొందర ఏమీ లేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. పీసీసీ చీఫ్ ఇలా రెండు రెండు మాటలు మాట్లాడితే కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను ఎలా నమ్మాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు, 2039 వరకు కూడా తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. భవిష్యత్‍లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా బీసీ నేత సీఎం అవుతారని, ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నారు. కానీ, భవిష్యత్‍లో మాత్రం బీసీ వ్యక్తి తప్పకుండా సీఎం అవుతారని పేర్కొన్నారు.