సినిమా

Paid Reviews: రక్తం ధారపోస్తే.. రివ్యూల పేరుతో చంపేస్తారా? బాక్సాఫీస్‌ను శాసిస్తున్న పెయిడ్ రివ్యూల దందా!

Paid Reviews: సినిమా అంటే ఒకప్పుడు కళ, కోట్లాది మంది అభిమానం. ఇప్పుడు మాత్రం కొందరు స్వార్థపరుల చేతుల్లో అది సులువైన బ్లాక్‌మెయిలింగ్ దందాలా మారిపోయింది. టికెట్ తెగి తెరపై బొమ్మ పడకముందే 'ఎక్స్' (ట్విట్టర్), యూట్యూబ్‌లలో స్టార్ రేటింగుల బేరసారాలు మొదలవుతున్నాయి. పైసలు ముట్టజెప్పిన మేకర్స్‌కు ఆకాశమంత పొగడ్తలు, ప్యాకేజీలు తిరస్కరించిన చిత్రాలకు పాతాళమంత నెగెటివిటీని కట్టబెడుతున్న ఈ "రివ్యూ సిండికేట్" ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.నేటి సినీ విశ్లేషణల ముసుగులో జరుగుతున్న తంతు అంతా ఇంతా కాదు. నిర్మాణ సంస్థల నుంచి ముట్టే ప్యాకేజీల ఆధారంగానే రివ్యూల స్వభావం మారుతోందన్న ఆరోపణలు బహిరంగ రహస్యంగా మారాయి. కాసుల వర్షం కురిపించిన ప్రాజెక్టులకు డల్ కంటెంట్ ఉన్నా ‘కల్ట్ క్లాసిక్’ అని బిరుదులు ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. డీల్స్ కుదరని సినిమాల ఫస్ట్ షో ముగియకముందే 'డిజాస్టర్' అనే ముద్ర వేసి ప్రేక్షకులు థియేటర్ వైపు రాకుండా చేయడం కొంత మంది చేస్తున్నారు. ఈ పైరసీ రేటింగుల వల్ల సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి స్వయంగా నిర్ణయం తీసుకునే కనీస స్వేచ్ఛను కూడా కోల్పోతున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.