తెలంగాణ

ఒకటే బకెట్ వాటర్.. స్నానం చేయొద్దని కండిషన్.. యువతి పోస్టు వైరల్!

హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య ఎంతలా ఉందో తేల్చి చెప్పే ఉదంతం ఇది. సమ్మర్ రాకముందే హాస్టల్స్, ఇంటి ఓనర్స్ రెంట్‌కు ఉండే వారికి నీళ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గట్టిగా అడిగితే నీళ్లు రాకపోతే మేం ఏం చేయాలి? అంటూ రివర్స్ అవుతున్నారని అద్దెకు ఉంటున్న వారు వాపోతున్నారు. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ఫలితంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయినట్టు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.దీంతో బోర్లలో నీరు లేక కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా జీవనం గడుపుతున్నారు. నగరంలోని జంట జలాశాయాల్లో ఉన్న నీటిని కేవలం తాగు కోసమే వినియోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా రోజువారీ వినియోగానికి నీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.