International

Nuclear Bomb in Space: ఆకాశంలో ఆ ఒక్క బాంబు పేలితే.. ప్రపంచం కుప్పకూలిపోతుందా!

Nuclear Bomb in Space: భూమి మీద యుద్ధాలు జరగాల్సిన పనిలేదు.. నగరాలపై క్షిపణులు పడాల్సిన అవసరమూ లేదు. మన కంటికి కనిపించని అంతరిక్షంలో ఒక్క అణుబాంబు పేలితే చాలు, భూమి మీద ఉన్న మొత్తం ప్రపంచమే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మొబైల్ ఫోన్లు మూగబోతాయి, ఇంటర్నెట్ కట్ అవుతుంది, జీపీఎస్ నావిగేషన్ ఆగిపోతుంది, వాతావరణ హెచ్చరికలు అందవు.. ఇలా మనిషి రోజువారీ జీవితం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలో తేలిన భయంకరమైన నిజం ఇది.ప్రస్తుతం భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో 13,000కు పైగా ఉపగ్రహాలు నిరంతరం తిరుగుతున్నాయి. మనం వాడే కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంటర్నెట్, బ్యాంకింగ్, నావిగేషన్ ఇలా ప్రతిదీ వీటిపైనే ఆధారపడి నడుస్తోంది. అయితే, విస్కాన్సిన్-మాడిసన్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు కంప్యూటర్ సిములేషన్ ద్వారా చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.