పేదల ఇండ్ల కూల్చివేతకు నోటీసులు.. ఖమ్మంలో హైటెన్షన్
ఖమ్మం జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారంటూ మున్సిపల్ అధికారులు స్థానికులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు అంతా ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చారు. ఈ ఘటనతో శ్రీనివాస నగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్యాయంగా తమ ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్లను కూల్చి భూములు లాక్కోవాలని చూస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్థానికులు మీడియాతో తమ గోడును వెల్లిబుచ్చారు. ‘నోటీసులు వచ్చి నెలరోజులు అయితే మాకు చెప్పకుండా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయండి అంటున్నారు . మా ఇల్లు వదిలి మేము ఎక్కడికి పోము.. సచ్చినా, బ్రతికినా ఇక్కడే ఉంటాము. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు అమ్మ అయ్యా అంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు.. కానీ, మొన్న ధర్నా చేస్తే మా బాధ ఏంటని ఒక్కరు కూడా అడగలేదు’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
