తెలంగాణ

‘రీల్ మాక్’ కాదు.. తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి : టీపీసీసీ చీఫ్

బీఆర్ఎస్ సభ్యులు మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, పార్టీ నాయకులకు, విపక్ష నాయకులకు, ఇతర పార్టీల నాయకులకు, మీడియా మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి పండుగ సందర్బంగా సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు, దమ్ముంటే మాజీ మంత్రి, సనత్ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిని చేయాలని డిమాండ్ చేశారు. పండగ రోజున తప్పని పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని, స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని పేర్కొన్నారు. దళితుల పట్ల బీఆర్‌ఎస్ వైఖరి స్పష్టం అయ్యిందని, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.