తెలంగాణ
దీపావళికి నో ‘స్పెషల్’.. చార్జీల బాంబులు పేల్చిన ఆర్టీసీ!
తెలంగాణ ఆర్టీసీ దోపిడీ మాములుగా లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు వస్తే చాలు పూనకం వచ్చినట్టు ఇష్టానుసారంగా చార్జీలు పెంచుకుంటూ పోతోందని మండిపడుతున్నారు. ఇటీవల దసరా పండుగకు సుమారు వారం రోజుల పాటు అసలు చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేసిన ఆర్టీసీ.. తాజాగా దీపావళి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ తీరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది.పండుగ పూట కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్టీసీలో భద్రత ఉంటుందని బస్ ఎక్కితే సాధారణ టికెట్ మీద 50 శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో ఇంట్లో ముగ్గురు ఉంటే ‘వన్ వే’ ప్రయాణానికే సుమారు రూ.2 వేలు అవుతున్నాయని ప్యాసింజర్స్ వాపోతున్నారు.
