తెలంగాణ

నా మాట ఎవరూ వినడం లేదు.. ఏఐసీసీకి పీసీసీ చీఫ్ ఫిర్యాదు

మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు మధ్య నెలకొన్న వివాదంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ‘నా మాటే వినకపోతే.. నేనెందుకు?’ అని పీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారిని వివరణ కోరితే.. ‘నీ కంటే మేము సీనియర్లం’ అంటూ ఎదురు సమాధానాలు చెబుతున్నారని, ఇలా అయితే పార్టీ వ్యవహారాలు నడపడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య గొడవలను మీరే పరిష్కరించాలంటూ ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పీసీసీ చీఫ్ లేఖ రాసినట్టు తెలిసింది. అందులో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో జరిగిన వివాదాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.