తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారినట్టు తెలుస్తోంది. సాధారణంగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలి.కానీ,అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.ఇక మండలిలోనూ గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. మండలిలో బీఆర్ఎస్‌కు మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కెమెరా ఫోకస్ వారి మీద ఉండటం లేదని తెలిసింది. తమను కెమెరాలో చూపించడం లేదని భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన చేశారు. తీన్మార్ మల్లన్న శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ఆయన పక్కన కూర్చొని జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ ‘బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ’ అంటూ నిరసన తెలిపారు. గమనించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.