కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు.. బయటపడ్డ నిమ్స్ డాక్టర్ బండారం!
TG: పేద ప్రజల ప్రాణాలు నిలిపే ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడ్డాగా ఓ ఉన్నతాధికారి సాగించిన అక్రమార్జన పర్వం తాజాగా బట్టబయలైంది. పేదల సేవ ముసుగులో అందినకాడికి దండుకుంటూ వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు ఏకకాలంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి విచారణ అధికారులే అవాక్కయ్యారు.ఎర్రగడ్డలోని కల్పతరు అపార్ట్మెంట్లో ఉన్న లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, స్నేహితులకు చెందిన ఎనిమిది కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో విలాసవంతమైన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4-BHK ఫ్లాట్, కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో రెండు 3-BHK ఫ్లాట్లు, వీటితో పాటు మణికొండ, పేటబషీరాబాద్, కూకట్పల్లి పరిసరాల్లో మరో ఐదు 2-BHK ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 8 లగ్జరీ ఫ్లాట్లను ఆయన కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
