మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా.. సీఎం కీలక నిర్ణయం!
రాష్ట్రంలో మరో కొత్త జిల్లా రాబోతుందంటూ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా మరో జిల్లా వస్తుందని తెలుస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలను విడతల వారీగా 33 జిల్లాలుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. పరిపాలన సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ జిల్లాలను విభజించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం కూడా జరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు తన మామ జైపాల్ రెడ్డి పేరు పెడతారని టాక్ వినిపిస్తోంది. తన భార్య కోరిక మేరకు కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో ఈ జిల్లా ఏర్పాటు కానుందని సమాచారం. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధం అయ్యిందని కూడా ప్రచారం జరుగుతోంది.
