నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీ
నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపించడంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం వరదలు తగ్గడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.భవన శిథిలాల కింద తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొరుగుదేశం నేపాల్‌కు భారత్ మానవతా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, నేపాల్ ప్రజలు సాధారణ పరిస్థితులను ఇప్పుడిప్పుడే చూస్తుండగా.. ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ NDRRMA కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భోటేకోషి నదిలో నీటిమట్టం మరోసారి భారీగా పెరుగుతోందని, ఈ మేరకు శబ్దాలను గుర్తించినట్లు రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించింది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాలు హై అలర్ట్‌లో ఉండాలని NDRRMA పలు సూచనలు చేసింది.
