National

తెలంగాణలో స్థానికత వివాదం.. మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో స్థానికత అంశంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పు వెలువరించింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, స్థానికత అంశంపై బెల్లం అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సోమవారం విచారించి డిస్మిస్ చేసింది. నాలుగేళ్ల పాటు ఒకేచోట విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందంటూ పిటిషనర్ తరఫున చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది.స్థానికత నిర్ధారణలో రాజ్యాంగబద్ధంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలే అంతిమమని కోర్టు స్పష్టంచేసింది. ఇదే అంశంపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం మరోసారి నొక్కిచెప్పింది.