రాజకీయాలు
National Politics: పార్టీలకు తప్పని అసమ్మతి సెగ.. రాష్ట్రాలు దాటుతున్న వివాదం!!..
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి.. ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు ఒక్క తెలంగాణకే పరిమితమైన అంశంగా కనిపించడం లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన వివాదం.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పది మంది టీఎంసీ ఎమ్మెల్యేల వ్యవహారంతో మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
ఒక పార్టీ తరఫున ప్రజల తీర్పుతో అసెంబ్లీలోకి వచ్చిన సభ్యుడు.. మధ్యలో పార్టీ మారితే ఆ ఎమ్మెల్యే పదవి కొనసాగాలా? లేక ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కొత్తగా ప్రజల ముందుకే వెళ్లాలా? అనే ప్రశ్న మరోసారి న్యాయస్థానం ముందుకొచ్చింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి తర్వాత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేల వ్యవహారం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
