National

స్టార్ లింక్ ఎంట్రీతో అంబానీ లాభాలు తగ్గుతాయి.. కానీ! : ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ‘అంబానీ’ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘స్టార్ లింక్’ ఇండియాలో అడుగుపెట్టకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్టార్‌లింక్ వస్తే ఇండియాలోని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ దొరుకుతుందని పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, చవకైన ఇంటర్నెట్ భారత్‌లో ఇప్పటికే దొరుకుతోందని ఓ నెట్టిజన్ పోస్టు పెట్టారు. నెలకు 4 డాలర్లతో 60 జీబీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ లభిస్తుందని రాసుకొచ్చాడు. స్టార్‌లింక్ అంటే కూడా ఇష్టమేనని భారత్‌లో వారికి లైసెన్స్ ఇవ్వాలని కోరారు. ఆ ట్వీట్‌‌కు మరో వ్యక్తి స్పందిస్తూ .. స్టార్ లింక్ భారత్‌లోకి వస్తే ఎలాంటి లాభం ఉండదని ట్వీట్ చేశారు. నెటిజన్ల ట్వీట్‌లపై ఎలాన్ మస్క్ స్పందించారు. అంబానీకి చెందిన ఇంటర్నెట్ దళారుల సైన్యం చేస్తున్న హాస్యాస్పద వాదనలకు ఏ మాత్రం అర్థం లేదని పేర్కొన్నారు. స్టార్ లింక్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వడం వలన అంబానీ లాభాలు తగ్గుతాయి కానీ, ఆయన వ్యాపారం మూతపడదని స్పష్టంచేశారు.