Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?
Nandus World: సోషల్ మీడియాలో వేలల్లో లైకులు, లక్షల్లో ఫాలోవర్లు ఉంటే చాలు.. కళ్లు మూసుకుని నమ్మేస్తున్న అమాయకత్వాన్ని కొందరు పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి, జీవితాన్ని మార్చుకోవాలన్న నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని యూట్యూబ్ వేదికగా భారీ మోసానికి తెరలేపిన వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. యూకే కేంద్రంగా 'నందుస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఇప్పుడు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.వరుస కేసులతో ఇరుక్కున్న రమానందనను సెప్టెంబర్ 16న ఇబ్రహీంపట్నం పోలీసులు, సెప్టెంబర్ 17న అద్దంకి పోలీసులు విచారించనున్నారు. ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు కొల్లగొట్టారు? ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించారు? ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అందమైన వీడియోలు, విదేశీ లైఫ్‌స్టైల్ చూసి గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోతామని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
