నా టార్గెట్ రేవంత్ మాత్రమే.. కాంగ్రెస్ కాదు : కొండా సుస్మిత
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల హీట్ అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. కూతురి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండాకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడంతో ఆమె నిన్న గాంధీభవన్‌కు వచ్చి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు..నన్ను ఎలా బాధ్యులు చేస్తారని’ కొండా సురేఖ కమిటీ ఎదుట వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తాజాగా మరోసారి కొండా సుస్మిత సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్టు చేస్తూ సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే.. కాంగ్రెస్ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి, అతని సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి రేవంత్‌కు ఏ అధికారం ఉంది? నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.
