తెలంగాణ

MusiRejuvenation: మూసీ పునరుజ్జీవనానికి లైన్‌క్లియర్.. ఫేజ్-1కు పర్యావరణ అనుమతులు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టులో మరో కీలక అడ్డంకి తొలగిపోయింది. ప్రాజెక్టు మొదటి దశ(ఫేజ్-1) అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (SEIAA) ముందస్తు పర్యావరణ అనుమతులు(EC) జారీ చేసింది. ఈ గ్రీన్‌సిగ్నల్‌తో దసరా పండుగ నాటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం రూ.7,055కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న మొదటి దశలో భాగంగా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21కిలోమీటర్ల మేర నదీ తీరాన్ని ‘వి’ఆకారంలో అభివృద్ధి చేయనున్నారు.