దునియా

Mumbai Mahaganpati : దేశంలోనే రిచెస్ట్ గణపయ్య.. రూ.703 కోట్ల ఇన్సూరెన్స్.. 66 కేజీల బంగారంతో అలంకరణ

Mumbai Mahaganpati: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలవుతున్న వేళ.. వాణిజ్య రాజధాని ముంబైలోని ప్రముఖ గణేష్ పండల్ మరోసారి సరికొత్త సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన గణపతిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్‌లోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ సేవా మండల్ మహాగణపతి శనివారం తొలిసారిగా భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా చేరుకున్న భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అయితే ఈసారి నిర్వాహకులు స్వామివారికి చేసిన భద్రతా ఏర్పాట్లు, అలంకరించిన ఆభరణాల విలువ తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.కింగ్స్ సర్కిల్ మహాగణపతిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు అనేంత అద్భుతంగా నిర్వాహకులు గణపయ్యను అలంకరించారు. స్వచ్ఛమైన బంగారు, వెండి వస్తువులతో పాటు అత్యంత విలువైన రత్నాలు, వజ్రాభరణాలతో విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణపయ్య అలంకరణలో ఏకంగా 66 కిలోలకు పైగా స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఆభరణాలు, దాదాపు 335 కిలోల వెండి కిరీటాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విలువైన రత్నాలను వాడారు. ధగధగ మెరిసిపోతున్న గణనాథుడిని దర్శించుకునేందుకు మొదటి రోజే భక్తజనం పోటెత్తారు.