తెలంగాణ

చిన్నారిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి.. ఎందుకంటే?

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసి వెళ్లిపోయింది. బాధిత చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని సమాచారం. వైద్యం చేయించడానికి డబ్బులు లేక, సాయం చేసేవారు రాక నిస్సహాయత వల్లే ఇలా చేసినట్టు తెలుస్తోంది. నగరంలోని ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో నివాసం ఉంటున్న షబానాకు ఇద్దరు కూతుళ్లు. తన భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేస్తూ కూతుళ్లను పోషించుకుంటోంది.అయితే, రెండో కూతురు రుక్సానా (6) గత కొంతకాలంగా పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోందని తెలిసింది. వైద్యం చేయించే స్థోమత ఆమెకు లేదు. సాయం కోసం చేతులు చాచినా ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.కట్టుకున్న వాడు వదిలేసిపోవడంతో ఒంటరైన షబానా.. ఎవరి నుంచి సాయం అందకపోవడంతో చివరకు కన్న బిడ్డను హుస్సేన్ సాగర్‌లో విసిరేసింది.