National

Recharge Hike: 5G ఖర్చులన్నీ మన నెత్తినేనా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ వడ్డన!

Recharge Hike: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే పూట గడవని రోజులివి. అలాంటి సామాన్యుడి బలహీనతనే టెలికాం కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ బాదుడుకు రంగం సిద్ధమైందా? అంటే టెలికాం వర్గాల నుంచి వస్తున్న సమాధానం వింటే గుండె గుభేలుమనడం ఖాయం. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లు ఏకంగా 12 నుంచి 15 శాతం వరకు ఎగబాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.దేశంలో 5G రాగానే ఏదో అద్భుతం జరిగిపోతుందని కలలు చూపించారు. స్పెక్ట్రమ్ వేలం, టవర్లు, కొత్త టెక్నాలజీ అంటూ కంపెనీలు వేల కోట్లు కుమ్మరించాయి. మరి ఆ పెట్టిన ఖర్చంతా ఎక్కడి నుంచి వస్తుంది? చివరకు ఆ భారాన్ని అంతా సామాన్య మొబైల్ యూజర్ల మీదే నెట్టేయాలని డిసైడ్ అయ్యాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే పని మొదలెట్టేసింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై నెలకు సైలెంట్‌గా 50 రూపాయలు పెంచేసింది. మళ్లీ దానికి కవరింగ్ ఇస్తూ.. "మేము విదేశీ రోమింగ్ ఫ్రీగా ఇస్తున్నాం కదా" అంటూ తియ్యటి కబుర్లు చెబుతోంది. వొడాఫోన్ ఐడియా కూడా సరిగ్గా ఇదే రూట్ ఫాలో అవుతోంది.