ఎమ్మెల్యే అంటే భయం లేదా?
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అంటే భయం లేదా? అని సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ అంటే లెక్క లేకుండా పోయిందని అధికారులపై గుస్సా అయ్యారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కుమురంభీం ఆదివాసీ భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను కార్యక్రమానికి వచ్చేలోపే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంపై ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి చూడకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని దానం నాగేందర్ అధికారులను నిలదీశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులను వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకునేలా ఎంత దూరమైనా వెళ్తానని దానం హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
