ఏపీ

బాలిక మిస్సింగ్ కేసు.. పోలీసులకు హైకోర్టు చివాట్లు

ఏపీలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఇంకా కనిపెట్టకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. మూడు నెలలు అయినా బాలిక ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోయారని..అసలు ఏం చేస్తున్నారని గుంటూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం.. "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయింది. బాధితురాలి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.