తెలంగాణ
‘రేవంత్ క్యాబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కరువైందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అధికారాలు, బాధ్యతలతో స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. క్యాబినెట్ సహచరులకు తగిన స్వేచ్ఛ నివ్వకపోతే భవిష్యత్తులో కొత్త సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
