రాజకీయాలు
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భారీ స్కాం : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ ఎత్తిపోతల పథకం టెండర్ల కేటాయింపు ప్రక్రియలో భారీ ఎత్తున నిధుల గోల్మాల్ జరిగిందని, టెండర్ల అలాట్ మెంట్ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ కీలక పోస్టు పెట్టారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం మంత్రి కంపెనీ మాత్రమే దరఖాస్తు చేసుకుందని, పోటీలో ఉన్న మిగిలిన సంస్థలన్నీ కేవలం కాగితాలకే పరిమితమైన "డమ్మీ కంపెనీలు" అని విమర్శించారు.
