తెలంగాణ

మల్లురవి సిగ్గులేకుండా హరీశ్ రావు ఇంటిముందు నిల్చున్నాడు : ఆర్ఎస్ ప్రవీణ్

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అన్నదాతలకు సాగు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని, అందుకే ఆగ్రహించిన అన్నదాతలు జూరాల ప్రాజెక్టు తాళాలు పగులగొట్టి వెళ్లి మరీ ఆయకట్టుకు నీళ్లు వదులుకున్నారని చెప్పారు. ఆయకట్టుకు నీళ్లు అందించాలని, రైతుల సమస్యలు, ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రైతులు తాళాలు పగులగొట్టి సాగు కోసం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి నియోజకవర్గంలో ఇలా జరిగితే ఆయన ఏం చేస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టవా? అని ఆర్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.