కలిసి పోరాడదాం, దేశాన్ని కాపాడుకుందాం- భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి
Bharat Summit: ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులను, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు మనల్ని గమనిస్తున్నారని తాను నమ్ముతున్నానని రేవంత్ అన్నారు.
దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోందని.. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.
