తెలంగాణ

KTR: పాలమూరు బిడ్డ కాదు.. రైతుల పాలిట శత్రువు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

KTR: పాలమూరు ముద్దుబిడ్డనని, నల్లమల పులినని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి అన్నదాతల పాలిట ప్రథమ శత్రువుగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత జిల్లాలోనే పంటలు నిలువునా ఎండిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. "ఇక్కడేమో నల్లమల పులిబిడ్డనని గొప్పలు చెప్పుకోవడం.. తీరా ఏపీలో చంద్రబాబు దగ్గరికి వెళ్లేసరికి పిల్లిలా మారిపోవడం రేవంత్‌కే చెల్లింది" అంటూ కేటీఆర్ చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి దశదినకర్మ ముగించుకుని తిరుగుపయనమైన కేటీఆర్ కాన్వాయ్‌ను దేశీ ఇటిక్యాల శివారులో రైతులు ఆపారు. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, తమ గోడు వినాలని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నదాతల ఆవేదన చూసి చలించిపోయిన కేటీఆర్.. వెంటనే వాహనం దిగి స్వయంగా పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు.