తెలంగాణ

TG: "వాటాలు కుదరకే నైనీ టెండర్ రద్దు..".. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

TG: సింగరేణి సంస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, కమిషన్ల పంపకాల్లో తేడాలు రావడం వల్లే సొంత మంత్రులే కుంభకోణాలను బయటపెట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికగా నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో ఆయన పాల్గొని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు.నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. "తామే నైనీ కుంభకోణాన్ని అడ్డుకున్నామని, దానివల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని మంత్రి గొప్పలు చెబుతున్నారు. అసలు నిజం అది కాదు.. లోపల వాటాల పంపకాలు కుదరకే ఈ టెండర్లను రద్దు చేసుకుని, ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కించుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు.