తెలంగాణ

రేవంత్‌.. మా భూములన్నీ రాసిస్తాం.. పేదల అకౌంట్లలో లక్ష కోట్లు వేస్తావా : కేటీఆర్

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన భూములున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ చేసిన ఆరోపణలను తుత్తునియలు చేస్తూ.. కనీవినీ ఎరుగని రీతిలో నేరుగా సీఎంకే బహిరంగ సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన 420 హామీల అమలులో మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు, యూరియా కొరత, సాగునీటి కష్టాలతో అల్లాడుతుంటే.. నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాన ప్రతిపక్షంపై అడ్డగోలుగా బురదజల్లుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ గతంలో ఎన్నికల వేళ గగ్గోలు పెట్టి, ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.