తెలంగాణ

కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!

రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.ఈ క్రమంలోనే‘దండోరా’ పేరిట కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల సారధ్యంలో హస్తం నేతలు డప్పు కొట్టుకుంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని తెలిసి అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఇంటికి బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు కాన్వాయ్‌లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు. దీంతో వారిని అరెస్టు చేసినట్టు సమాచారం.