తెలంగాణ

KTR: 9 టీఎంసీలున్నా పంటలకు నీళ్లెందుకు వదలట్లేదు : కేటీఆర్

KTR: జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కళ్లముందే ఎండిపోతున్న పంటలకు సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కార్ పచ్చని పంటల ఉసురు తీస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాగునీటి అవసరాలకు కేవలం 2 టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, మిగిలిన నీటిని ఆయకట్టుకు ఇవ్వకుండా రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.చేతికొచ్చిన పంటలు నాశనమవుతుంటే తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించడం రేవంత్ ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు విని వారికి అండగా నిలవాల్సింది పోయి, కేసులు పెట్టి అరిగోస పెట్టడం దుర్మార్గమన్నారు.