సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?
తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన మంత్రి కొండా సురేఖకు పదవీ గండం పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మంత్రి కొండా.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని,వాటితో తనకు సంబంధం లేదని కమిటీ పెద్దలకు సమాధానం ఇచ్చారు. మంత్రి వివరణపై క్రమశిక్షణా కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో మంత్రి పదవి నుంచి కొండాను తప్పించాలని పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణా కమిటీ రిపోర్టు పంపించినట్టు తెలిసింది. ఇదిలాఉండగా, ఇవాళ రాఖీ పండుగ కావడంతో మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు బంగారు రాఖీ కట్టారు. దీంతో ఆమెకు పొంచి ఉన్న పదవీ గండం తప్పినట్టేనా? అని ప్రచారం జరుగుతోంది.
