రాజకీయాలు

కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?

అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది.వీరిద్దరి పదవులు తొలగించాలని ఏఐసీసీకి రిపోర్టు పంపించింది. తాజాగా మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రమశిక్షణా కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, దానిని ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించామన్నారు. ఆమె పరిశీలించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పీసీసీ చీఫ్ తెలిపారు. కొండా మురళి వచ్చి కలిస్తే తప్పకుండా మాట్లాడుతానని వెల్లడించారు.