National

మహిళలకు పెళ్లి ఓ ట్రామా.. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు!

భారతీయ వివాహ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సామాజిక అంచనాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో పాల్గొన్న ఆమె... పెళ్లి అనేది మహిళల జీవితంలో కేవలం ఒక సంబరం కాదని, అదొక పెద్ద మానసిక వేదన అని పేర్కొన్నారు. పైకి కంటికి ఇంపుగా, కోలాహలంగా కనిపించే వేడుకల వెనుక... ఏళ్లుగా పెరిగిన సొంత ఇంటిని, కన్నవారిని వదిలి గుర్తుతెలియని కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టే సమయంలో స్త్రీలు పొందే భావోద్వేగ సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. అత్తవారింటికి కోడలిగా వెళ్లిన మరుక్షణమే ఆ మహిళపై సమాజం అపరిమితమైన నిబంధనలు, అంచనాలను రుద్దుతుందని కిరణ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు.