తెలంగాణ

Khairatabad By Poll: గులాబీ గూటిలో ఖైరతాబాద్ లొల్లి.. దానంను ఢీకొట్టేది ఎవరు?

Khairatabad By Poll: హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ సెగ్మెంట్‌లో బైపోల్ అనివార్యంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ పోరు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా బీఆర్ఎస్‌కి చావో రేవో సమస్యగా మారింది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా ఖైరతాబాద్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ దళం ముమ్మర కసరత్తు చేస్తుంది.ప్రస్తుతం బీఆర్‌ఎస్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ అభ్యర్థిత్వం. ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమారుడికి కేటాయిస్తే గెలిపించుకుని వస్తానని తలసాని అధిష్టానం వద్ద గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో దానం, తలసాని వర్గాల మధ్య తీవ్ర పోటీ వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఉప ఎన్నిక ముంచుకొస్తుండటంతో దానం నాగేందర్‌ను ఢీకొట్టేందుకు సాయికిరణ్‌ను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే ఖైరతాబాద్ పోరు కాస్తా 'దానం వర్సెస్ తలసాని' ప్రత్యక్ష యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.