ఖైరతాబాద్ బై పోల్.. బరిలో నిలిచేది ఎవరో చెప్పిన టీపీసీసీ చీఫ్!
ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయితే, ఈ తీర్పు కాంగ్రెస్ సర్కారుకు చెంపపెట్టు కాదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని పేర్కొన్నారు. శనివారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ సభ్యత్వం రద్దు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమం, ప్రజా పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాత్రమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. దానం నాగేందర్ తిరిగి ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో నిలుస్తారా? లేదా? అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించి నిర్ణయిస్తుందని వెల్లడించారు.
