కేంద్రహోంశాఖ కీలక నిర్ణయం.. లడక్‌లోని ఆ ప్రాంతాలకు అధికారిక పేర్లు
పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు మరోసారి తెరమీదకు వస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న జమ్మూకశ్మీర్‌లో విభజించబడిన కేంద్రపాలిత ప్రాంతం లడక్‌లో కేంద్రం పలు ముఖ్యనిర్ణయాలు తీసుకుంది. లడక్‌లోని 28 కీలక ప్రదేశాలు, భౌగోళిక విశేషాలను ప్రామాణిక పేర్లతో భారత అధికారిక చిత్రపటంలో నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర హోంశాఖ సమన్వయంతో లడక్‌లోని అధికార యంత్రాంగంతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సర్వే ఆఫ్ ఇండియా (SoI) అధికారిక మ్యాప్‌లో ఈ 28 ప్రాంతాలను అధికారిక పేర్లతో పొందుపరిచినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వ్యూహాత్మక ప్రాంతాలు, పర్వత కనుమలు, నివాస ప్రాంతాలు, భౌగోళిక విశేషాలను కచ్చితమైన వివరాలతో జాతీయ మ్యాప్‌లో ప్రామాణీకరించినట్టు తెలిపింది.
