జననమరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక మార్పులు
జననమరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జనన, మరణాల నమోదు చట్టం -1969లో తీసుకొచ్చిన 'ది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్మెంట్) యాక్ట్–2026' కొత్త నిబంధనలు చేయగా.. అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఆలస్యంగా ధ్రువపత్రాలు పొందే విధానాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం నిర్ణీత సమయంలోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందలేని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.జననం లేదా మరణం సంభవించిన 21 రోజుల్లోపు స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) ద్వారా ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ధ్రువీకరణ పత్రం కోసం నమోదు చేసుకోవచ్చు.21 రోజుల నుండి 30 రోజులలోపు అయితే.. నిర్ణీత ఆలస్య రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చు. ఇక 30 రోజుల నుండి ఒక సంవత్సరంలోపు అయితే నిర్ణీత ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు చేయబడుతుంది. ఒక ఏడాది నుండి 2 సంవత్సరాల లోపు అయితే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ప్రత్యేక అనుమతి తప్పనిసరి పొందాల్సి ఉంటుంది.
