తెలంగాణ

ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ.. స్టేషన్ ముందు పబ్లిక్ సంబరాలు

Keesara ACB Trap: పోలీస్ స్టేషన్ అంటే భయం.. ఠాణా మెట్లు ఎక్కాలంటే వణుకు. అలాంటిది ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే జనం టపాసులు కాల్చారు.. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రక్షక భటులుగా ఉంటూ లంచాల వేటలో మునిగిపోయిన సీఐ, ఎస్సైలు ఏసీబీ వలలో చిక్కడంతో స్థానిక ప్రజలు పండుగ చేసుకున్నారు.కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి అందినకాడికి దండుకుంటూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన కీలక అధికారులే ఇలా ఒకేసారి కటకటాలపాలు కావడం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.